Home  »  Featured Articles  »  రవితేజ 'దొంగోడు'కి 20 ఏళ్ళు.. ఏ సినిమాకి రీమేకో తెలుసా!

Updated : Aug 7, 2023

మ్యూజికల్ బ్లాక్ బస్టర్ 'ఔను.. వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు!'(2002)తో హిట్ జోడీ అనిపించుకున్నారు మాస్ మహారాజా రవితేజ, కళ్యాణి. ఆ సినిమా విడుదలైన ఏడాది తరువాత ఈ ఇద్దరు మరో మూవీతో ఎంటర్టైన్ చేశారు. ఆ చిత్రమే.. 'దొంగోడు'. రీమేక్ సినిమాల స్పెషలిస్ట్ గా పేరు తెచ్చుకున్న భీమినేని శ్రీనివాసరావు.. ఈ రొమాంటిక్ కామెడీ డ్రామాని తెరకెక్కించారు. మలయాళంలో ఘనవిజయం సాధించిన 'మీస మాధవన్' (దిలీప్, కావ్య మాధవన్) ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. రేఖ మరో హీరోయిన్ గా కనిపించిన ఈ సినిమాలో తనికెళ్ళ భరణి, రియాజ్ ఖాన్, బ్రహ్మానందం, సునీల్, పరుచూరి వెంకటేశ్వరరావు, ఉత్తేజ్, చంద్రమోహన్, ఎమ్మెస్ నారాయణ, షకీలా, పవిత్రా లోకేశ్, వర్ష, ఉమ, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, జీవా, రంజిత, దువ్వాసి మోహన్ ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమిచ్చారు. 

కథ విషయానికి వస్తే.. చిన్నప్పుడు చెల్లి ఆకలి తీర్చడానికని తొలిసారిగా దొంగతనం చేసిన మాధవ (రవితేజ).. క్రమంగా పెద్ద దొంగ అవుతాడు. మాధవ ఎవరినైనా చూస్తూ మీసం మేలేస్తే.. ఆ ఇంట్లో దొంగతనం జరగడం ఖాయమన్నట్లుగా ఊర్లో పేరుంటుంది. అలాంటి మాధవ.. దుష్టుడైన ఆ ఊరి భూస్వామి నాయుడు (తనికెళ్ళ భరణి)తో వ్యక్తిగత సమస్య ఉంటుంది. మరోవైపు నాయుడు కూతురు రుక్మిణి మొదట్లో మాధవని ద్వేషించినా.. అతని మంచితనం తెలిసి ప్రేమిస్తుంది. ఇదిలా ఉంటే, రుక్మిణిపై కన్నేసిన ఎస్. ఐ (రియాజ్ ఖాన్) మాధవ చేయని దొంగతనాన్ని అతనిపై అంటకడతాడు. ఈ క్రమంలో.. మాధవ తన నిజాయితీని ఎలా నిరూపించుకున్నాడు? అన్నది మిగిలిన సినిమా.  

విద్యాసాగర్ సంగీతమందించిన ఈ చిత్రానికి 'సిరివెన్నెల' సీతారామశాస్త్రి, బండారు దానయ్య సాహిత్యమందించారు. "కోడి ముందా", "మీసాల గోపాల", "ఎంత పనిజేసిందే", "సొట్గ బొగ్గల", "డుమ్ డుమ్ డుమ్", "దొంగ దొంగ" (థీమ్ సాంగ్).. ఇలా ఇందులోని పాటలన్నీ ఆకట్టుకున్నాయి. భీమనేని రోషిత సాయి నిర్మించిన 'దొంగోడు'.. 2003 ఆగస్టు 7న జనం ముందు నిలిచింది. నేటితో ఈ జనరంజక చిత్రం 20 వసంతాలు పూర్తిచేసుకుంది. 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.